Sunday, September 16, 2012

మామయ్య కోసం


చంకనేసుకుని
ఎంచక్కా లోకాన్ని
పైనుంచి చూడ్డం నేర్పావు.

మా బులిబులి అడుగులకు
చిటికెన వేలందించి పరిగెత్తించావు
పరుగులు తీయించి
రనౌట్ కాకుండా ఉండటం నేర్పించావు!

అడగకుండానే అన్నీ నేర్పావు..

తెలుపూ నలుపూ గడుల
గెలుపోటముల్ని సమంగా చూడ్డం నేర్పావు..
అన్నీ నేర్పావు.

సైకిల్ నేర్చుకుంటూ
మోచిప్పలు పగలగొట్టుకుంటే
బైకెక్కించి గాయాల్ని మరిపించావు

కారు కొన్నదే తడవు
డ్రైవింగు సీట్లో కూర్చోబెట్టి
బ్రతుకు స్టీరింగు తిప్పడం నేర్పావు!

అడగకుండానే అన్నీ నేర్పావు..

అయిదు రోజులు ఆసుపత్రిలో
నిశ్చల నిర్నిమేష బాధాతప్త హృదయంతో
మడమ తిప్పక పోరాడ్డం నేర్పించావు
మృత్యువు నీ దరిజేరడానికి
ఎన్ని రహస్యమయ దారులు వెదుక్కుందో!

అలాంటి సమయంలో సైతం
ఏం చెయ్యాలో, మాట్లాడాలో
ఎలా ఎదుర్కోవాలో
ఒక పాఠమై నేర్పించావు!

అన్నీ నేర్పావు..

ఇన్ని నేర్పిన మామయ్యా-

ఇంకేం నేర్పుదామని
అమాంతంగా వదిలేసి పోయావు?
అర్థాంతరంగా అనాథల్ని చేశావు!

నువ్వు నేర్పందే
మేమేమీ నేర్చుకోలేమని
ఇప్పుడిప్పుడే అర్థమైంది.

కవరేజి లేని ఏరియలో లేని నిన్ను
పలకరించడం నేర్పకుండానే
వెళ్ళిపోయావు...
పోయావు!

        -బాబి